Header ad

చెక్-డాంల నిర్మాణాలతో నీటి వృధాకు ఇక చెక్ పెట్టనున్న తెలంగాణ

తెలంగాణకు 60 ఏళ్ళుగా శాపంగా మారిన నీటి సమస్యను శాశ్వతంగా రూపుమాపడానికి ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ప్రభుత్వం ఇప్పటికే భారీ, చిన్న, మధ్యతరహా నీటి ప్రాజెక్టులతో పాటు, హరితహారం, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ లాంటి పతకాలను అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు నూతనంగా చెక్-డాంల నిర్మాణాలని కూడా భారీ ఎత్తులో నిర్మించాలని నిర్ణయించడం తెలంగాణకు ముదావహం. అయితే వంతెనల నిర్మాణంతో పాటుగా చెక్-డాంలను ఒక ఉద్యమ స్పూర్తి తో నిర్మించాలనే నిర్ణయం ముఖ్యమంత్రి గారికి తెలంగాణ సమాజ అభివృద్ధి పట్ల ఉండే నిబద్దతకు తార్కాణమనే చెప్పాలి.

నదులు లేదా వాగుల పరివాహక ప్రాంతాలలో చెక్-డాంలను వర్షపు నీటి సంరక్షణకు ఆనకట్టల మాదిరిగా ఉపయోగించుకోవటం సాధారణమే. అయితే దీనికి సాంకేతికత జోడించి వెసులుబాటు ఉన్న ప్రాంతాలలో చెక్-డాం లను కూడా పొందుపరచడం ఒక వినూత్న ప్రయోగమే అని చెప్పాలి.

ఈ మధ్యనే R&B విభాగం వారు ముఖ్యమంత్రి సూచనల మేరకు చెక్-డాంల డిజైన్ మరియు నిర్మాణ ప్రక్రియలో మెళకువలు అధ్యయనం చేయటానికి మహారాష్ట్ర కు ఒక ఉన్నత స్థాయి బృందాన్ని పంపింది. ఆ బృందం తదనంతరం తెలంగాణ వ్యాప్తంగా పర్యటించి, దాదాపు 532 వంతెనల నిర్మాణాలను పరిశీలించి 174 ప్రాంతాలు చెక్-డాం ల నిర్మాణానికి అనుకూలంగా ఉన్నాయని నివేదికను సమర్పించింది. ఈ నివేదిక ఆధారంగా ప్రభుత్వం R&B శాఖ ద్వార ఈ  చెక్-డాం లను కట్టడానికి శ్రీకారం చుట్టింది. ఇందులో ఆదిలాబాద్ జిల్లా అత్యధికంగా 63 చెక్ డాంలకు అవకాశం ఉంటే, మెదక్ లో ౩౩, ఖమ్మం లో 29, వరంగల్ లో 12, రంగారెడ్డి లో 10 మొదటివిడతగా చెప్పట్టాలని నిర్ణయించడం అయిందని R&B శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు మా హైదరాబాద్ కి తెలిపారు.

వంతెనల నిర్మాణక్రమంలో కేవలం 15% అదనపు ఖర్చుతో ఎటువంటి అదనపు వనరుల అవసరం లేకుండా చెక్-డాం లను పొందుపరచవచ్చు. వారధుల కట్టడాలలో నదీ గర్భంలో బల్లపరుపుగా వేసే శ్లాబు నిర్మాణంపై ప్రవాహ దిశకు అడ్డంగా అంటే వంతెనకు సమాంతరంగా కేవలం రెండు లేదా మూడు వరుసల మేసనరి కట్టడం ద్వారా ఈ చెక్-డాంలను నిర్మించుకోవచ్చనేది దీని నివేదిక సారాంశం.

వంతెనలకు ఎగువ దిశలో నీటి నిలువకు అనుకూలంగా ఉండే ప్రదేశాల ఎంపిక చాలా కీలకం. చెక్-డాం ల నిర్మాణంలో వంపులు లేని ప్రవాహక్రమం, నీటి నిలువ పరిమాణం, వంతెన మరియు ఇరువైపులా ఉండే కట్టలు ముంపుకు గురి కాకుండా ఉండే విధంగా ఆకృతుల నిర్మాణం వంటి అంశాలు ప్రాధాన్యం కలిగి ఉంటాయి.

ఈ చెక్-డాంలతో కూడిన వంతెనలను హరిత నిర్మాణాలుగా రూపకల్పన చేసినట్లయితే గ్లోబల్ వార్మింగ్ వంటి సమస్యలు, కర్బన ఉద్గారాల తీవ్రత తగ్గి పర్యావరణానికి ముందు తరాలకు ఏంతో మేలు చేసినట్లు అవుతుంది. అంతే కాకుండా భూగర్భ జలాల పరిరక్షణ, జంతువుల తాగునీటి అవసరార్ధం, ఇతర నీటి వినియోగ అవసరాలకు ఏంతో ఉపయోగంగా ఉండడమే కాక పెద్దనదులపై నిర్మించే ఆనకట్టల వలన కలిగే ముంపు, వన్య ప్రాణుల అంతరింపు వంటి అభ్యంతరాలు లేకుండా, చిన్న చిన్న మొత్తాలలో పలు ప్రాంతాలలో నీటి నిలువ సాధ్యపడుతుంది. దీనితో కరువు ముప్పును శాశ్వతంగా అధిగమించవచ్చు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *

Contact Us